Tuesday, 24 January 2017

మోసం చేస్తూ, మోసపోతూ ఎన్నాళ్ళిలా ...

పవన్ కళ్యాణ్ 'దేశ్ బచావో' అంటున్నారట. అంటే, ఇక్కడ దేశ్ అనటంలో ఆయన ఉద్దేశం భారత దేశమా లేక తెలుగు దేశమా అన్నది నాకు అర్థం కాలేదు. ఒకవేళ భారత దేశం అని ఆయన ఉద్దేశ్యం అని అనుకున్నట్టయితే ఆయన మద్దతిచ్చి గెలిపించిన (అలానే అనుకుంటున్నట్టుందిలే) భాజపా దేశాన్ని నాశనం చేస్తోంది అని భావిస్తున్నారా? అంటే మరొకసారి దేశాన్ని కాంగ్రెస్ కబంధహస్తాలలో పెట్టాలని ఆయన ఉద్దేశమా? లేకపోతే తాడూ బొంగరం లేని మూడో పక్షానికి కట్టబెట్టాలనా? ఆ మూడో పక్షానికి ఆయన చుక్కాని కావాలనుకుంటున్నారేమో బహుశా! ఒకవేళ ఆయన దేశం అనటంలో ఆయన ఉద్దేశ్యం భారతదేశం కాదు తెలుగు దేశం అని అయితే దాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. ఆయన మాటలు, చేతలు చూస్తుంటే మాత్రం దేశ్ బచావో అని చెప్పటంలో పరమార్థం భారతదేశం అయితే కాదు అనే అనుకుంటున్నాను. ఎప్పుడయితే ప్రతిపక్షాలు లేదా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా చర్యలు/ఉద్యమం చేపడతారో ఆ సమయానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆయా బాధిత వర్గాలను కలుసుకుని చల్లబరచటమో, దృష్టి మళ్ళించటమో చెయ్యటం అన్నది గత రెండున్నర సంవత్సరాలుగా సాగుతున్న నాటకం అన్నది అందరూ గమనిస్తున్న విషయమే. జల్లికట్టు స్ఫూర్తిగా ప్రజలు/విద్యార్థి లోకం, ప్రతిపక్షాలు మొదటిసారి కలిసి చెయ్యాలని ఆలోచన చేస్తున్న ఉద్యమాన్ని హైజాక్ చేసి, విజయవంతంగా పక్కదారి పట్టించే ప్రయత్నాలు తనవైపు నుంచి ఆయన చేస్తున్నారు. కావాలంటే చూడండి, రేపు పొరపాటునో లేక ఎవరి పథకం ప్రకారమే ఎదో ఒక చిన్న హింసాత్మక చర్య (ప్రేరేపిత లేదా రెచ్చగొట్టబడిన) లేదా ప్రమాదం సంభవించిందనుకోండి వెంటనే 'సామాన్యులు ఇబ్బంది పడకూడదు, మీ తరఫున నేను పోరాడుతాను' అనే ప్రకటనతో నిర్వీర్యం చెయ్యటం జరిగి తీరుతుంది. తెలిసి చేస్తున్నారో లేక తెలియక చేస్తున్నారో కానీ బోడిగుండుకు మోకాలికి లంకె కూడా పెట్టె ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాజకీయ/ఎన్నికల హామీ అయినటువంటి ప్రత్యేక హోదాకి, జల్లికట్టుకు లంకె పెడుతూ ద్రవిడ జాతి అంటూ అర్థం పర్థం లేకుండా అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం చేస్తున్నారు. మోసం చేస్తూ, మోసపోతూ ఎన్నాళ్ళిలా ...

1 comment: