ఏమంటివి,
ఏమంటివి సోషల్ మీడియా నందు ఎవడు పడితే వాడు ఏది పడితే అది పోస్ట్
చేయుచున్నాడని అంటివా? ఏది పడితే అది పోస్ట్ చేయుట అనునది ఇవాళ మొదలైనదా,
సోషల్ మీడియా నందు మాత్రమే అనుకొనుచుంటివా? అయినను ఇది అసత్య ప్రేలాపనల
పర్వమే గాని, సత్యపీఠమెక్కి నిక్కముగ సత్యమును వచించు పోటీ కాదు కదా. కాదు
కూడదు ఇది సత్యపరీక్షయే యనినయెడల నీ ప్రేలాపనలేటువంటివి. నాతో
చెప్పింతువేమయ్యా, యూట్యూబ్ తెరచి చూసినయెడల ఎన్నికల ప్రచారపర్వమందు
వాక్రుచ్చిన పలుకులను 'కలలో చెప్పితినా నీకంటూ' విలేఖరులతో బొంకితివి
కదయ్యా. ఇంకా ఏల ఈ వగచుట? అయిననూ మన జాతిగొట్టాలు
ప్రతిసారి ప్రచురించునది సత్యమనుకొనుచుంటివా, వారు చూపునది నిజమేనని అనుకొనుచుంటివా? ఏమయ్యా వారు చెప్పినది నిజమని నమ్మినందునే కదా బొక్కాబోర్లాపడి ముందు పళ్ళు రాలగొట్టుకుని పదేళ్ళు ప్రతిపక్షవాసము చేసితివి? అసత్యము, అసత్యము అని
ఇప్పుడు వగచెదవేల. జాతిగొట్టాలు అసత్యములనన్నిటినీ నొక్కివక్కాణించి,
బల్లగుద్ది నిజమను రీతిన ప్రచారము చేయు సమయున నవరంధ్రములు మూసికొని కూచొని
యుంటివా? ఇది ఏమైనా జాతిగొట్టముల రీతిన నీ అదుపాజ్ఞలలో ఉండుననుకొనుచుంటివా?
అయినచో ఇదియే మా ప్రకటనము వినుము, గమనించుకొనుము - సర్వధా శతధా సహస్రధా సకల ప్రాంతములయందును జాతిగొట్టముల వంటి బాకా మీడియా సంస్థల ద్వారా
పాపపంకిలము గావించబడిన మీడియాను సమూలంగా ప్రక్షాళన గావించుటకొరకై
ఉద్భవించిన అయిదో స్థంభం (మీడియా నాలుగో స్థంభం కదా, అందుకని) అయిన సోషల్
మీడియా దెబ్బను కాచుకొనుము ...
నేను - నా ఇజం
Tuesday, 31 January 2017
Monday, 30 January 2017
పదిలక్షల కోట్లకు పైగా విలువ చేసే
అవగాహనలు (Memorandum of Understanding అనగా అవగాహనా తాఖీదు) కుదిరినంత
మాత్రాన అవి ఒప్పందాలే అన్నట్టుగా విపరీత ప్రచారం చేస్తున్నారు. యాభైకి
పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యి అవగాహనలు కుదుర్చుకున్నారని
అంటున్నారు. వారే ప్రచురించిన చిత్రాలలో ఒక్క విదేశీ మొహం కూడా కనబడటం
లేదు. ఇక అవగాహన పత్రాలు మార్చుకోవటానికి చంద్రబాబు గారి వద్దకు వరుసలో
నిలబడి వస్తున్న వారిని చూస్తేనే అవి యే స్థాయీవో, వారెలాంటివారో
చూచాయగానైనా అర్థమయ్యేట్టు ఉంది. నిజాలు జాతిగొట్టాలకే ఎరుక లేదా
జాతిగొట్టాలు చెప్పినవే నిజాలు అనుకోవాలేమో. ఇక కొన్ని చిత్రాలలో ఉన్న
వ్యక్తుల పుట్టు పూర్వోత్తరాలు ఇప్పటికే వెలుగు చూసినా, వాటిపై నోరు మెదపటం
లేదు. బాకా ఊదే దినపత్రికలలో స్థానిక ప్రచురణలో ఒకరకంగా, ప్రధాన ప్రచురణలో
మరో రకంగా అవగాహనాల విలువను ప్రచురించారు. పది లక్షల కోట్లకు పైగా విలువ
చేసే అవగాహనలు, ఇరవై రెండు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు అంటూ
ఊదరగొడుతున్నవారు ముందుగా అవగాహనలు కుదుర్చుకున్నవారు ఎవరు, ఎటువంటి
పరిశ్రమలు, ఏ ప్రదేశాలలో ఏర్పాటు అవ్వబోతున్నాయి వంటి తత్సంబంధిత వివరాలతో
సరియైన సమాచారంతో వాస్తవాలు ప్రచురిస్తే బావుంటుంది కానీ గాలిలో విన్యాసాలు
వద్దు. వివరాలు అడిగితే, విమర్శిస్తే ప్రతిపక్షమే అంటే అవును నేను
ప్రతిపక్షమే ... వెళ్లి సమాచార చట్టం క్రింద వివరాలు తెచ్చుకోండి అంటారా
మరి మీరు జాతిగొట్టాలు ప్రచురించిన వార్తలనే నిజాలు అన్నట్టు ప్రచారం చేయటం
సరియైనదేనా? ఆ వార్తలన్నీ ఆ చట్టం క్రింద వివరాలు తెలుసుకునే రాశారా?
అసలు పెట్టుబడులకు స్వర్గధామం అనబడే యే ప్రపంచదేశాల్లో సదస్సులు
నిర్వహించినా ఒకటి రెండు రోజులలో వివరాలు తెలియకుండా, తెలుసుకోకుండా లక్షల
కోట్ల విలువ చేసే ఒప్పందాలు జరగవు. కాస్త వాస్తవానికి దగ్గర ఉండే కల్పనలు
చెయ్యాలి కానీ, చిన్న చేప తిమింగళాన్ని మింగిందంటే ఎలా?
Thursday, 26 January 2017
శాంతియుత ధర్నా చేస్తామంటే
ప్రభుత్వానికి అంతటి భయమెందుకు? ప్రతిపక్షంలో ఉన్నపుడు తామెన్నడూ ఇలాంటివి
చెయ్యలేదా? అప్పట్లో లెక్కకు మిక్కిలి ధర్నాలు, నిరసనలు చేసి చరిత్ర
సృష్టించినట్టున్నారు కదా. తమరు చేస్తే ఒకటి, ఇతరులు చేస్తే మరొకటా? ఇప్పటికైనా
చంద్రబాబు ప్రజల అభీష్టానికి అనుగుణంగా నడుచుకోవాలి, ప్రత్యేకహోదా సాధన
కోసం కేంద్రంతో పోరాడాలి. పోరాడితే పోయేదేమీ లేదు. వాళ్ళు ఇప్పుడు పెద్దగా
ఉద్ధరిస్తున్నదేమీ లేదు, నాలుగు ఎంగిలి మెతుకులు విదిలిస్తున్నట్టు ఉంది
తప్పించి. తమిళనాడులో జల్లికట్టు నిషేధానికి వ్యతిరేకంగా జరిగిన నిరసనలు
విజయవంతమయ్యామంటే కారణం ప్రభుత్వం ప్రజల అభిప్రాయాన్ని గౌరవించి, కేంద్రంతో
పోరాడి సాధించింది. కానీ, ఇక్కడ ప్రజలు అప్పట్లో స్వయంగా మోడీ ఇచ్చిన
హామీపై పోరాడుతుంటే, చంద్రబాబు అణచివేయాలని చూస్తున్నారు. హోదా ఎందుకు
వద్దో మీరు చెబుతున్నారు, ఎందుకు కావాలో వారు చెబుతున్నారు. హోదా కావాలంటూ
శాంతియుత నిరసన వ్యక్తం చేస్తామంటే దానిని అణిచివేయాలని చూడటం గర్హనీయం.
ఇప్పటికైనా చంద్రబాబు మేలుకోవాలి, ప్రజల అభిప్రాయానికి విలువ ఇవ్వాలి.
కేంద్రంతో పోరాటం చేతకాకపోతే కాకపోయే, కానీ పోరాడేవారిని అడ్డుకోవటం మాత్రం
చెయ్యకండి.
Tuesday, 24 January 2017
మనం చెప్పుకుంటూంటాం 'మేకలను బలి ఇస్తారు కానీ పులులను ఇవ్వలేరు' అని. ఈ పెటా తదితర మేధావి లేదా జంతుప్రేమిక వర్గాలు కూడా అంతే. జల్లికట్టు లాంటి సంవత్సరానికి ఒకసారో లేదా రెండుసార్లో జరిగే విషయాల మీద పోరాడతారు తప్పించి ప్రతిరోజూ జరిగే మాంసాహారం తంతుని నిషేధించమని మాత్రం ఉద్యమించరు. ఇక్కడ పోరాటం అనగా న్యాయస్థానాలలో వ్యాజ్యం వేయటం, వాదనలు వినిపించి న్యాయస్థానాలు ఒప్పుకునేలా చేయటం అని నా ఉద్దేశ్యం. అలా అడిగితే 'ఆ దిశగా చాలా చేస్తున్నాం' అంటారు; ఏమి చేస్తున్నారయ్యా అంటే ఎదో ఒక సెలెబ్రిటీని పట్టుకుని బట్టలిప్పించి ఫోటోలు తీసి దాన్నే ఒక పోరాటంగా చెప్పుకోవటం, ఎవరో ఒక సెలెబ్రిటీతో ఒక వాక్యం చెప్పించటం. మరి అదే తరహా పోరాట ధోరణిని ఈ జల్లికట్టు తరహా వాటిలో ఎందుకు అవలంబించరు? ఎవరో ఒక సెలెబ్రిటీని పట్టుకుని బట్టలిప్పించి ఫోటో సెషన్ అదే జల్లికట్టుకు వ్యతిరేకంగా చెయ్యండి. ఏదో చేసామన్న తృప్తి తమరికి ఉంటుంది, అలానే మాకూ నయనానందకరంగా ఉంటుంది. శకుంతలాకియా నువ్వన్నా సెప్పరాదూ ...
జల్లికట్టు నిషేధం/నిషేధం ఎత్తివేత
అన్న అంశాల విషయంలో నాకు తెలిసినంతవరకూ "పెటా అనే ఒక సంస్థ స్త్యున్నత
న్యాయస్థానంలో 'జంతుహింస' అనే అంశాన్ని ప్రాతిపదికగా చూపుతూ జల్లికట్టును
నిషేధించాలని వ్యాజ్యం వేశాయి. వారి వాదనలు విన్న న్యాయస్థానం జల్లికట్టును
నిషేధిస్తూ తీర్పునిచ్చింది. దాన్ని వ్యతిరేకిస్తూ తమిళులు ఆందోళనబాట
పట్టారు." బహుశా ఇంతే
అనుకుంటా. కానీ, మధ్యలో దీనికి మోడీకి లంకె పెట్టటం ఏమిటో నాకైతే అర్థం
కాలేదు. అక్కడికీ, మన తెలుగు వాళ్ళ గోడు పట్టనప్పటికీ భౌగోళికంగా మనక్రింద
ఉన్న రాష్ట్రమైన తమిళనాడులోని తమిళుల ఆందోళన గుర్తించిన ఆయన ఒక
ఆర్డినెన్స్ తెస్తూ జల్లికట్టు నిర్వహించుకునేలా చేస్తానని హామీనివ్వటమే
కాక ఆ దిశగా యుద్ధప్రాతిపదికన చర్యలు కూడా చేపట్టినట్టున్నారు. మరి ఇందులో
మోడీని విమర్శించాల్సిన అగత్యం ఏమిటో నాకైతే అర్థం కాలేదు. ఎందుకంటే పెటా ఈ వ్యాజ్యం వేసింది కూడా ఎప్పుడో 2012 లో అనుకుంటా అప్పుడు కేంద్రంలో ఉన్నది యుపిఏ ప్రభుత్వం. ప్రతిదానికీ
మోడీకి లంకె పెట్టటం ఎంతవరకూ సబబు? ఇదేదో బోడిగుండు, మోకాలు వ్యవహారంలా
ఉంది తప్పించి అర్థవంతంగా లేదు. ఒకవేళ ఈ నిషేధంలో మోడీ ప్రమేయం ఉందని ఏవైనా
వార్తాకథనాలో లేక ఆధారాలో ఉన్నట్టయితే వాటిని తెలుపగలిగితే బావుంటుంది.
మోసం చేస్తూ, మోసపోతూ ఎన్నాళ్ళిలా ...
పవన్ కళ్యాణ్ 'దేశ్ బచావో'
అంటున్నారట. అంటే, ఇక్కడ దేశ్ అనటంలో ఆయన ఉద్దేశం భారత దేశమా లేక తెలుగు
దేశమా అన్నది నాకు అర్థం కాలేదు. ఒకవేళ భారత దేశం అని ఆయన ఉద్దేశ్యం అని
అనుకున్నట్టయితే ఆయన మద్దతిచ్చి గెలిపించిన (అలానే అనుకుంటున్నట్టుందిలే)
భాజపా దేశాన్ని నాశనం చేస్తోంది అని భావిస్తున్నారా? అంటే మరొకసారి
దేశాన్ని కాంగ్రెస్ కబంధహస్తాలలో పెట్టాలని ఆయన ఉద్దేశమా? లేకపోతే తాడూ
బొంగరం లేని మూడో పక్షానికి కట్టబెట్టాలనా? ఆ మూడో పక్షానికి ఆయన చుక్కాని
కావాలనుకుంటున్నారేమో బహుశా! ఒకవేళ ఆయన దేశం అనటంలో ఆయన ఉద్దేశ్యం భారతదేశం
కాదు తెలుగు దేశం అని అయితే దాన్ని స్పష్టంగా చెప్పగలగాలి. ఆయన మాటలు,
చేతలు చూస్తుంటే మాత్రం దేశ్ బచావో అని చెప్పటంలో పరమార్థం భారతదేశం అయితే
కాదు అనే అనుకుంటున్నాను. ఎప్పుడయితే ప్రతిపక్షాలు లేదా ప్రజలు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఇబ్బంది పెట్టేలా
చర్యలు/ఉద్యమం చేపడతారో ఆ సమయానికి పవన్ కళ్యాణ్ వచ్చి ఆయా బాధిత వర్గాలను
కలుసుకుని చల్లబరచటమో, దృష్టి మళ్ళించటమో చెయ్యటం అన్నది గత రెండున్నర
సంవత్సరాలుగా సాగుతున్న నాటకం అన్నది అందరూ గమనిస్తున్న విషయమే. జల్లికట్టు
స్ఫూర్తిగా ప్రజలు/విద్యార్థి లోకం, ప్రతిపక్షాలు మొదటిసారి కలిసి
చెయ్యాలని ఆలోచన చేస్తున్న ఉద్యమాన్ని హైజాక్ చేసి, విజయవంతంగా పక్కదారి
పట్టించే ప్రయత్నాలు తనవైపు నుంచి ఆయన చేస్తున్నారు. కావాలంటే చూడండి, రేపు
పొరపాటునో లేక ఎవరి పథకం ప్రకారమే ఎదో ఒక చిన్న హింసాత్మక చర్య (ప్రేరేపిత
లేదా రెచ్చగొట్టబడిన) లేదా ప్రమాదం సంభవించిందనుకోండి వెంటనే 'సామాన్యులు
ఇబ్బంది పడకూడదు, మీ తరఫున నేను పోరాడుతాను' అనే ప్రకటనతో నిర్వీర్యం
చెయ్యటం జరిగి తీరుతుంది.
తెలిసి చేస్తున్నారో లేక తెలియక చేస్తున్నారో కానీ బోడిగుండుకు మోకాలికి
లంకె కూడా పెట్టె ప్రయత్నం కూడా చేస్తున్నారు. రాజకీయ/ఎన్నికల హామీ
అయినటువంటి ప్రత్యేక హోదాకి, జల్లికట్టుకు లంకె పెడుతూ ద్రవిడ జాతి అంటూ
అర్థం పర్థం లేకుండా అసలు విషయాన్ని పక్కదారి పట్టించే ప్రయత్నం
చేస్తున్నారు. మోసం చేస్తూ, మోసపోతూ ఎన్నాళ్ళిలా ...
Monday, 23 January 2017
జల్లికట్టు అన్నది ఒక సాంస్కృతిక
అంశంగా తమిళులందరినీ ఏకం చేసి పోరాడేలా చేసింది, ఇది తమతో ముడిపడిన అంశంగా
భావించారు కాబట్టి తమిళులు ఉద్యమించారు. రాజకీయ పార్టీలు తప్పనిసరిగా
వారితో కలిసిపోవాల్సి వచ్చింది. కానీ, మనకు 'ప్రత్యేక హోదా' అన్నది ఒక
రాజకీయ అవసరంగా మాత్రమే పరిగణించబడుతోంది. ఉద్యమం మొగ్గలో ఉండగానే
చంద్రబాబు గారు 'ప్రత్యేక హోదా అన్నది ఏమీ సంజీవని కాదు, నేను
కష్టపడుతున్నాను, కేంద్రంతో పోరాడి హోదాకు సమానమైన నిధులు తెస్తాను' అని
ఒక్క మాట అంటారు, ఇక ఐకమత్యం ఎక్కడినుండి వస్తుంది. ఎవరి రాజకీయ అవసరాలు
వారివి తప్పించి 'ప్రేత్యేక హోదా' అన్నది రాష్ట్రానికి సంబంధించిన అంశంగా
పరిగణించి పోరాడే వర్గాలు ఎక్కడున్నాయి. ప్రజలు, రాజకీయపక్షాలు కలిసి
పోరాడనంత కాలం ఇది ఒక అందని ద్రాక్షగానే ఉంటుంది తప్పించి జరిగే పని కాదు. మొన్నటి తెలంగాణా ఉద్యమం కానీ, ఇవ్వాల్టి జల్లికట్టు ఉద్యమం కానీ సఫలం అయ్యాయంటే కారణం ప్రజా ఉద్యమాలే తప్పించి రాజకీయ అవసరాలు కాదు.
Subscribe to:
Posts (Atom)