Friday, 1 July 2016

ఇక్కడకొచ్చిన కొత్తలో వీళ్ళు మనిషి కంటే కుక్కకే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు అనుకునేవాడిని! కాని నా అభిప్రాయం తప్పు అని త్వరలోనే తెలుసుకున్నా. ఇప్పుడు అంతా మనిషి కంటే కుక్క కంటే లేదా మరే పెంపుడు జంతువు కంటే కూడా యంత్రానికి ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నారు అని అర్థం అయ్యింది :) వారితో పాటు మనవారు కూడా అదే బాట పట్టారు ... అయినా ఈ ప్రపంచీకరణ యుగం లోమన వారు పరాయి వారు అంటూ లేరు కదా :)
చరిత్ర పుటల్లో వెతికితే/చదివితే విజయం సాధించిన ప్రతి ఒక్కరు తమ విజయానికి కారణాలుగా చెప్పేవి శ్రమ, దీక్ష, పట్టుదల, ఓటమికి వెరవని ధైర్యం గట్రాల్లాంటి ఉన్నత లక్షణాలు. విచిత్రమేమిటంటే ఇవే లక్షణాలు వక్రమార్గంలో పయనించిన వ్యక్తులను చరిత్రలో భయోత్పాతం సృష్టించిన వారిగా నిలబెట్టాయి. [ఉదా: హిట్లర్] ఒక నాణేనికి రెండు పార్శ్వాలలాగా ఈ ఉన్నత లక్షణాలకు మంచి, చెడు అన్న రెండు కోణాలు ఉండటం వైచిత్రి. ఇదే ప్రధానాంశంగా 'చివరి పేజీ' అని ఒక కాల్పనిక కథా చిత్రణ చేస్తున్నాను ... గత కొద్ది సంవత్సరాలుగా కథ క్రమం రూపొందించటం పై కసరత్తు చేస్తున్నాను. సలహాలకు, సూచనలకు స్వాగతం ... - ఒక స్వాప్నికుడు.
అంతా ఫ్రీ, అన్నీ ఇచ్చేస్తా, కులానికి ఒకటి, మతానికి ఇంకోటి, మీ దగ్గర ఓట్లు ఉన్నాయా ఐతే మీకు ఇంకేదో ఒకటి ఇచ్చేస్తా అంటున్న ఒక మహా మేధావి రాజకీయనాయకుడికి ఒక అవుడియా - అయ్యా భార్యాభర్తలను విడదీసి ఒక వర్గం ఓట్లు గుంప గుత్తగా పొందగలిగే ఆలోచన ఏమైనా చెయ్యండి. మీ ప్రాప్తం వాళ్ళ ఖర్మ ... ఏమంటారు? :)
"ఆలోచన" మతం లాంటిది. నువ్వు దాన్ని ఎంత బలంగా నమ్ముతావో అంత బలంగా ఆచరిస్తావు ... ప్రపంచంలో ప్రతి మతం, సిద్ధాంతం, విప్లవం, మార్పు పేరేదైనా కానివ్వండి అది ఒక ఆలోచనలోంచే ఉద్భవించింది ... అందుకే స్వామి వివేకానంద చెప్పినట్లు "ఒక మహోన్నతమైన ఆదర్శాన్ని నీ జీవిత ధ్యేయంగా చేసుకో. దాన్ని గురించే ఆలోచించు. దానికి అనుగుణంగా జీవించు. నీ మెదడు, నరాలు, కండరాలు, నీ శరీరమంతా నీ ఆదర్శంతో/ఆలోచనతో నిండాలి."
అంతా తమకు తాము మహాత్మా గాంధికి ఏకలవ్య  శిష్యులమని చెప్పుకునే వారే, ఆయన చూపిన బాటలో నడుస్తున్నామనే వారే. కాని వారు గమనించని లేదా గమనించటానికి ఇష్టపడని అంశం ఒకటి ఉంది - గాంధీకి వాదమే కాదు ఓపిక కూడా ఉంది. ఆంగ్లేయులు తన డిమాండ్స్ కి స్పందించలేదని తన బాటను మార్చుకోలేదాయన. ఆయనతో పాటు ఉన్న కొందరిలో ఆయనంత ఓపిక లేనివారికి అసహనం ఎక్కువై వేరు దారులు పట్టారు, కాని చివరికి సహనం ముందు సామ్రాజ్యం తల వంచింది. ఈ విజయం గాంధి ఒక్కడిదే కాకపోయిఅప్పటికి ముందుంది నడిపించిన సైన్యాధ్యక్షుడిగా ఆయన ఒక మహాత్ముడిగా నిలిచిపోయాడు. ఈ విషయాన్ని ఈనాటి ఆయన ఏకలవ్య మరియు అనుంగు శిష్యులు గమనించాలని కోరుతూ - ఒక స్వాప్నికుడు. 
ఆకాశంలో విష్ణు పాదాల వద్ద ఉండే గంగ పవిత్రంగా ఉంటుందిట, అది మెట్టు మెట్టుగా దిగుతూ భూమ్మీదకు వచ్చి, అందరి పాపాలతో కాలుష్యభారితమై చివరకి ఉనికి పోగొట్టుకుంటుంది. ఏడాది క్రితం ఆకాశగంగ లాగా ఉన్న ఒక వ్యక్తి/శక్తి ఇప్పుడు భూమ్మీద ప్రవహించే గంగ స్థాయికి చేరాడు ... యితడు కూడా ముందరి వారిలాగా పుస్తకాలలో ఒక పాఠ్యామ్సంగా మిగిలిపోకూడని కోరుకుంటూ - ఒక స్వాప్నికుడు
అప్పుడెప్పుడో ఒకసారి మధ్య ఆర్జీవీ ఒక కామెంట్ పెట్టారు ట్విట్టర్ లో - "అన్నా హజారే జనాన్ని మర్చిపోయాడా లేక జనం అన్నా హజారేని మర్చిపోయారా?" అని. జనమే మర్చిపోయారని అనుకుంటున్నాను, జనావళికి ఓపిక తక్కువ [నేను కూడా ఆ జనావళి లో ఒకడినే]. ఏదైనా వెంటనే జరిగిపోవాలన్తే - ఆలస్యం ఐతే మద్దతుగా ఎవడు ఉంటాడండి? ప్రభుత్వ ఉద్యోగులకు అంత తీరిక, అవసరం లేదు; ప్రైవేటు ఉద్యోగులకు వారాంతపు రోజులలో తప్ప వీలు కాదు లేదంటే జీతం కట్ అవుద్ది మరి; ఇక కూలి నాలి చేసుకునేవారికి ఆ రోజు భత్యం ఇస్తే కాని రారు. ఇక మిగిలింది ఫేస్ బుక్ లో లో లైకులు కొట్టే మనలాంటి వాళ్ళు, విద్యార్థులు - ఇలాంటి వాళ్ళని నమ్ముకుని ఉద్యమం అంటే కుక్కతోక పట్టుకుని గోదారిని ఈదటం లాంటిదే ...
గమనిక: ఇవన్ని నా వ్యక్తిగత అభిప్రాయాలు మాత్రమే ఎవరిని బాధ పెట్టటానికి కాని, విమర్సించటానికి కాని ఉద్దేశించినవి కావు. :)