ఏమంటివి,
ఏమంటివి సోషల్ మీడియా నందు ఎవడు పడితే వాడు ఏది పడితే అది పోస్ట్
చేయుచున్నాడని అంటివా? ఏది పడితే అది పోస్ట్ చేయుట అనునది ఇవాళ మొదలైనదా,
సోషల్ మీడియా నందు మాత్రమే అనుకొనుచుంటివా? అయినను ఇది అసత్య ప్రేలాపనల
పర్వమే గాని, సత్యపీఠమెక్కి నిక్కముగ సత్యమును వచించు పోటీ కాదు కదా. కాదు
కూడదు ఇది సత్యపరీక్షయే యనినయెడల నీ ప్రేలాపనలేటువంటివి. నాతో
చెప్పింతువేమయ్యా, యూట్యూబ్ తెరచి చూసినయెడల ఎన్నికల ప్రచారపర్వమందు
వాక్రుచ్చిన పలుకులను 'కలలో చెప్పితినా నీకంటూ' విలేఖరులతో బొంకితివి
కదయ్యా. ఇంకా ఏల ఈ వగచుట? అయిననూ మన జాతిగొట్టాలు
ప్రతిసారి ప్రచురించునది సత్యమనుకొనుచుంటివా, వారు చూపునది నిజమేనని అనుకొనుచుంటివా? ఏమయ్యా వారు చెప్పినది నిజమని నమ్మినందునే కదా బొక్కాబోర్లాపడి ముందు పళ్ళు రాలగొట్టుకుని పదేళ్ళు ప్రతిపక్షవాసము చేసితివి? అసత్యము, అసత్యము అని
ఇప్పుడు వగచెదవేల. జాతిగొట్టాలు అసత్యములనన్నిటినీ నొక్కివక్కాణించి,
బల్లగుద్ది నిజమను రీతిన ప్రచారము చేయు సమయున నవరంధ్రములు మూసికొని కూచొని
యుంటివా? ఇది ఏమైనా జాతిగొట్టముల రీతిన నీ అదుపాజ్ఞలలో ఉండుననుకొనుచుంటివా?
అయినచో ఇదియే మా ప్రకటనము వినుము, గమనించుకొనుము - సర్వధా శతధా సహస్రధా సకల ప్రాంతములయందును జాతిగొట్టముల వంటి బాకా మీడియా సంస్థల ద్వారా
పాపపంకిలము గావించబడిన మీడియాను సమూలంగా ప్రక్షాళన గావించుటకొరకై
ఉద్భవించిన అయిదో స్థంభం (మీడియా నాలుగో స్థంభం కదా, అందుకని) అయిన సోషల్
మీడియా దెబ్బను కాచుకొనుము ...
No comments:
Post a Comment