Monday, 30 January 2017

పదిలక్షల కోట్లకు పైగా విలువ చేసే అవగాహనలు (Memorandum of Understanding అనగా అవగాహనా తాఖీదు) కుదిరినంత మాత్రాన అవి ఒప్పందాలే అన్నట్టుగా విపరీత ప్రచారం చేస్తున్నారు. యాభైకి పైగా దేశాలకు చెందిన ప్రతినిధులు హాజరయ్యి అవగాహనలు కుదుర్చుకున్నారని అంటున్నారు. వారే ప్రచురించిన చిత్రాలలో ఒక్క విదేశీ మొహం కూడా కనబడటం లేదు. ఇక అవగాహన పత్రాలు మార్చుకోవటానికి చంద్రబాబు గారి వద్దకు వరుసలో నిలబడి వస్తున్న వారిని చూస్తేనే అవి యే స్థాయీవో, వారెలాంటివారో చూచాయగానైనా అర్థమయ్యేట్టు ఉంది. నిజాలు జాతిగొట్టాలకే ఎరుక లేదా జాతిగొట్టాలు చెప్పినవే నిజాలు అనుకోవాలేమో. ఇక కొన్ని చిత్రాలలో ఉన్న వ్యక్తుల పుట్టు పూర్వోత్తరాలు ఇప్పటికే వెలుగు చూసినా, వాటిపై నోరు మెదపటం లేదు. బాకా ఊదే దినపత్రికలలో స్థానిక ప్రచురణలో ఒకరకంగా, ప్రధాన ప్రచురణలో మరో రకంగా అవగాహనాల విలువను ప్రచురించారు. పది లక్షల కోట్లకు పైగా విలువ చేసే అవగాహనలు, ఇరవై రెండు లక్షలకు పైగా ఉద్యోగ అవకాశాలు అంటూ ఊదరగొడుతున్నవారు ముందుగా అవగాహనలు కుదుర్చుకున్నవారు ఎవరు, ఎటువంటి పరిశ్రమలు, ఏ ప్రదేశాలలో ఏర్పాటు అవ్వబోతున్నాయి వంటి తత్సంబంధిత వివరాలతో సరియైన సమాచారంతో వాస్తవాలు ప్రచురిస్తే బావుంటుంది కానీ గాలిలో విన్యాసాలు వద్దు. వివరాలు అడిగితే, విమర్శిస్తే ప్రతిపక్షమే అంటే అవును నేను ప్రతిపక్షమే ... వెళ్లి సమాచార చట్టం క్రింద వివరాలు తెచ్చుకోండి అంటారా మరి మీరు జాతిగొట్టాలు ప్రచురించిన వార్తలనే నిజాలు అన్నట్టు ప్రచారం చేయటం సరియైనదేనా? ఆ వార్తలన్నీ ఆ చట్టం క్రింద వివరాలు తెలుసుకునే రాశారా? అసలు పెట్టుబడులకు స్వర్గధామం అనబడే యే ప్రపంచదేశాల్లో సదస్సులు నిర్వహించినా ఒకటి రెండు రోజులలో వివరాలు తెలియకుండా, తెలుసుకోకుండా లక్షల కోట్ల విలువ చేసే ఒప్పందాలు జరగవు. కాస్త వాస్తవానికి దగ్గర ఉండే కల్పనలు చెయ్యాలి కానీ, చిన్న చేప తిమింగళాన్ని మింగిందంటే ఎలా?

No comments:

Post a Comment